అక్షరటుడే, వెబ్డెస్క్: Durgam Cheruvu | హైదరాబాద్ నగరంలోని మాధాపూర్ దుర్గం చెరువులో (Durgam Cheruvu) గుర్రం డెక్క పెరిగి దుర్గంధం వ్యాపిస్తోంది. ఆహ్లాదం పంచాల్సిన చెరువు కళావిహీనంగా మారింది.
దుర్గంచెరువులో గుర్రపు డెక్క వ్యాప్తి చెందడం, దుర్గంధంగా మారడంపట్ల మీడియా కథనాలు, స్థానికుల నుంచి హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) మంగళవారం చెరువును పరిశీలించారు. చెరువులో సగభాగం వరకూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వరద కాలువ ద్వార మురుగు నీరు నేరుగా చెరువులోకి కలవడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీపీలకు వెళ్లే మురుగు నీరు అధికంగా ఉండడంతో ఇటువైపు మల్లించాల్సి వచ్చిందని అక్కడ ఇరిగేషన్ ఇంజినీర్లు చెప్పగా అది సరికాదన్నారు.
Durgam Cheruvu | సమన్వయంతో పని చేయాలి..
చెరువును అభివృద్ధి చేయడం అంటే పైపై మెరుగులు దిద్దడం కాదని రంగనాథ్ అన్నారు. దుర్గం చెరువు పనులు చేపట్టిన రహేజా సంస్థ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. చెరువులోకి మురుగు నీరు కలవడం.. గుర్రపు డెక్క వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యతలు చేపట్టిన అన్ని సంస్థలతో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు.
Durgam Cheruvu | ఖాజాగూడ చెరువు కబ్జాలపై..
ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయడం.. డైవర్ట్ చేయడంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు. చెరువు అలుగుతో పాటు తూములు మూసేయడం డైవర్ట్ చేసినట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖలు మార్చినట్టు గుర్తించారు. చెరువు ఆనవాళ్లు లేకుండా చేయడాన్ని గమనించారు. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంతమంది ఆక్రమించుకుని షెడ్డులు వేసుకున్నారు. వీటిపై త్వరలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది.