అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గురువారం రెండు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించింది.
నగరంలోని చెరువులు, నాలాలతో పాటు పార్కులు, రోడ్ల ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాలను తొలగిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తోంది. తాజాగా గచ్చిబౌలి (Gachobowli)లో 2,500 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది. గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ (BSNL) ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గజాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500 గజాల వరకూ ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. మిగిలిన 2500 గజాల స్థలంలో కూడా ప్లాట్లున్నాయంటూ కొంతమంది ఆక్రమించారు.
Hydraa | ప్రజావాణి ఫిర్యాదుతో..
పార్క్ కబ్జాపై టెలికామ్ నగర్ నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో కలసి హైడ్రా సిబ్బంది పరిశీలించారు. 4 వేల గజాలు పార్కుకు కేటాయించినట్టు గుర్తించారు. అయితే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా.. మిగిలిన ఆక్రమణలను గురువారం తొలగించారు. పార్క్ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, హైడ్రా బోర్డు పెట్టారు.
Hydraa | రోడ్డును ఆక్రమించి గోడలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట (Shamirpet)లోని ఫ్రెండ్స్ కాలనీలో రోడ్డు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబరు 1198లో 4.20 ఎకరాల పరిధిలో ఫ్రెండ్స్ కాలనీ పేరిట 1987వ సంవత్సరం లే ఔట్ వేశారు. ఇందులో 20 ఫీట్ల రహదారిని ఆక్రమించి గోడలు నిర్మించారు. గేటు కూడా ఏర్పాటు చేసి పక్కనే ఉన్న ప్లాట్లలోకి కలిపేశారు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రోడ్డు ఆక్రమణలను హైడ్రా తొలగించింది.