అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | బాచుపల్లిలో (Bachupally) 2.30 ఎకరాల పార్కు భూమిని హైడ్రా (Hydraa) కాపాడింది. సదరు భూమి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) బచుపల్లి మండలంలో ప్రజల కోసం పార్కుకు కేటాయించిన 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సిబ్బంది మంగళవారం కాపాడారు. అలాగే ఎంఆర్‌వో కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాల నుంచి విముక్తి కల్పించి స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్లు 142, 143 మరియు 144లో ఉన్న 2.30 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ 2016లో అధికారికంగా పార్కు అభివృద్ధి కోసం కేటాయించారు. అనంతరం పార్క్‌ను అభివృద్ధి చేశారు.
Hydraa | ప్రజావాణి ఫిర్యాదుతో..
కొందరు ప్రైవేట్ వ్యక్తులు 2023లో ఆ భూమిని తమ ఆస్తిగా పేర్కొంటూ, మొక్కలను ధ్వంసం చేసి, నర్సరీని తొలగించారు. రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మించారు. దీనిపై ఇటీవల స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ భూమిని పార్కు భూమిగా కేటాయించినట్లు నిర్ధారించి, కబ్జాలను తొలగించారు. ఆ భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. అదే సర్వే నంబర్లలో ఎంఆర్‌ఓ కార్యాలయానికి కేటాయించిన 30 గుంటల భూమి కూడా కబ్జాకు గురైనట్లు గుర్తించారు. హైడ్రా కబ్జాలను తొలగించి, భూమి చుట్టూ కంచె వేసింది. పార్క్ స్థలాన్ని కాపాడటంతో స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.