అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని హిమాయత్‌నగర్ ఆదర్శనగర్ బస్తీ పరిసరాల్లో 30 ఏళ్ల మురుగు సమస్యను పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్ ఆదేశించారు. బస్తీలో మంగళవారం ఆయన పర్యటించారు.
మురుగు నీరు సాఫీగా వెళ్లక.. ఇళ్లలోకి పోటెత్తి బోరు బావుల్లోకి చేరడం, నాలాల్లో కలవడంతో తాగు నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వందడగుల దూరంలో హుస్సేన్‌సాగర్ నాలా ఉండగా.. మురుగుతో పాటు వర్షం పడినప్పుడు వరద ముంచెత్తడానికి గల కారణాలను తెలుసుకున్నారు. హిమాయత్‌నగర్‌పై నుంచి వచ్చే మురుగు, వరద నీరు తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని ఆదర్శనగర్ బస్తీ వాసులు తెలిపారు.
Hydraa | పనులు ప్రారంభించాలి
మురుగు సమస్యను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) నాలా వరకూ పనులు పూర్తి స్థాయిలోనే చేపడతామని చెప్పారు. మురుగు, వరద నీరు ఎటువైపు వాలుగా వెళ్తుందో పరిశీలించి వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. 6 మీటర్ల మేర కొన్ని పైపు లైన్లు దెబ్బతిన్నాయని.. వాటిని మార్చాలని జలమండలి అధికారులు వివరించారు. పై నుంచి వస్తున్న వరద, మురుగు నీటిని అంచనా వేసి.. పెద్ద పైపులు వేయాలని కమిషనర్ సూచించారు. హుస్సేన్ సాగర్ రిటైనింగ్ వాల్ కూడా 35 మీటర్ల మేర దెబ్బతిందని, దానిని కూడా పూర్తి చేయాలని సూచించారు. హైడ్రా డీఎఫ్‌వో యజ్జనారాయణ, జలమండలి డీజీఎం కృష్ణయ్య, జీహెచ్ఎంసీ డీఈ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
