అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | చెరువుల ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ పరిధిల్లో మట్టి పోయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల స్వరూపాన్ని మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు (Mella Cheruvu), గండిపేట చెరువులను శనివారం హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో మట్టి పోసి చెరువులను నింపుతున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. మట్టి పోసే అవకాశం లేకుండా ఫెన్సింగ్ వేయాలని ఆయన సూచించారు. అలాగే మట్టి ఎవరు పోసారో వాళ్లతోనే తీయించాలని.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. 48 గంటల్లో మట్టిని తొలగించకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.
Hydraa | పార్కు కబ్జాల తొలగింపు
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 32లో రెండు ఎకరాలకు పైగా ఉన్న పార్కులో ఆక్రమణలను జీహెచ్ఎంసీతో (GHMC) కలసి హైడ్రా తొలగించింది. పార్కు కబ్జాకు గురైందని.. అందులో అక్రమ కట్టడాలు వచ్చాయని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో కమిషనర్ శనివారం పరిశీలించార. వెనువెంటనే ఆక్రమణలను తొలగించడానికి ఆదేశించారు. దీంతో అధికారులు ఆక్రమణలను తొలగించారు.
హుస్సేన్ సాగర్‌కు మంచినీటిని తీసుకు వచ్చే చారిత్రక బుల్కాపూర్ నాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు. మణికొండ ప్రాంతంలో బుల్కాపూర్ నాలాను ఆయన పరిశీలించారు. ఈ నాలాను పునరుద్ధరిస్తే చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.