HomeతెలంగాణCP Sajjanar | యూట్యూబ్​ ఛానెళ్లపై హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ ఆగ్రహం.. ఎందుకంటే?

CP Sajjanar | యూట్యూబ్​ ఛానెళ్లపై హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ ఆగ్రహం.. ఎందుకంటే?

హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ పలు యూట్యూబ్​ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూస్​ కోసం మైనర్లతో అసభ్యకర వీడియోలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CP Sajjanar | హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. యువత చెడు మార్గాలు పట్టకుండా సూచనలు చేస్తుంటారు.

సజ్జనార్​ గతంలో ఆర్టీసీ ఎండీగా కొనసాగిన సమయంలో సైతం సైబర్​ నేరాలు, రీల్స్​ కోసం ప్రమాదకరంగా స్టంట్లు చేసే వారిని హెచ్చరిస్తూ అనేక పోస్టులు పెట్టారు. అంతేగాకుండా బెట్టింగ్​ యాప్​ ప్రమోషన్లపై ఆయన ప్రశ్నించడంతోనే ప్రభుత్వం పలువురిపై కేసులు పెట్టింది. తాజాగా సజ్జనార్​ పలు యూట్యూబ్​ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూస్, లైక్స్​తో పాటు సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ కావడానికి కొన్ని ఛానెళ్లు చిన్నారుల భవిష్యత్​ను పణంగా పెడుతున్నాయని మండిపడ్డారు. పిల్లలతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

CP Sajjanar | రెచ్చిపోతున్న ఛానెళ్లు

ఇటీవల కొన్ని యూట్యూబ్​ ఛానెళ్లు (YouTube Channels)రెచ్చిపోతున్నాయి. ఎవరిని పడితే వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. సోషల్​ మీడియాలో పిచ్చి చేష్టలతో ఫేమస్​ అయిన వారిని పిలిచి వీడియోలు తయారు చేస్తున్నారు. వారు అసభ్యకరంగా మాట్లాడుతున్నా.. అలాగే పోస్ట్​ చేస్తున్నారు. వ్యూస్​, లైక్​ల కోసం ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాగే ఇటీవల కొందరు మైనర్లు ప్రేమ పేరుతో రీల్స్​ చేయగా.. వారిని సైతం కొన్ని ఛానెళ్ల వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారిపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు, యువతకు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేయాలని సూచించారు.

CP Sajjanar | పోక్సో కేసులు పెడతాం

పిల్లలతో అసభ్యకర వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడం బాలల హక్కుల ఉల్లంఘన అని సీపీ సజ్జనార్​ (CP Sajjanar) అన్నారు. అలాంటి వారిపై పోక్సో యాక్ట్​ (POCSO Act), జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుందని ఆయన అన్నారు. మైనర్లతో అలాంటి కంటెంట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణమే ఆ వీడియోలను తొలగించాలని సూచించారు. భవిష్యత్​లో మళ్లీ ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేసి, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.