అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabadi Biryani | హైదరాబాద్ బిర్యానీ మరో అరుదైన గ్లోబల్ గుర్తింపు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ రైస్ డిష్‌ల జాబితాలో హైదరాబాదీ బిర్యానీకి 10వ స్థానం లభించింది.
ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ (World Best Rice Dishes) లిస్ట్ ఆఫ్ 2025లో హైదరాబాద్ బిర్యానీ (Hyderabadi Biryani) టాప్ 10లో నిలవడమే కాకుండా, టాప్ 50 డిషెస్‌లో చోటు దక్కిన ఏకైక భారతీయ వంటకం కావడం విశేషం. చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్ రివ్యూలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భోజన ప్రియులు ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తొలి మూడు స్థానాలు జపనీస్ వంటకాలకు దక్కాయి. నెగిటోరోడాన్, సుషీ, కైసెన్డాన్ వరుసగా 1, 2, 3 స్థానాల్లో నిలిచాయి.
Hyderabadi Biryani | టాప్ టెన్‌లో..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నప్పటికీ, లక్నో, కాశ్మీరీ, కోల్‌కతా బిర్యానీలను వెనక్కి నెట్టి, హైదరాబాద్ బిర్యానీ అగ్రగామిగా నిలవడం ఫుడ్ లవర్స్‌కి గర్వకారణంగా మారింది. టాప్ 50లో మరో బిర్యానీ పేరిట కనిపించిన వంటకం ఇరాన్‌కు చెందిన ‘బిర్యానీ యే ఇస్ఫహాన్’ కావడం కూడా ఆసక్తికరం. దేశవ్యాప్తంగా బిర్యానీ వేర్వేరు రకాలుగా వండినా, హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకంగా నిలిచే కారణం దీని ప్రత్యేక తయారీ విధానం. కచ్చి బిర్యానీలో మాంసాన్ని మసాలాలతో మ్యారినేట్ చేసి, బియ్యంతో కలిసి ఒకేసారి నెమ్మదిగా ‘దమ్’ మీద ఉడికిస్తారు. ఇది దీని అసలైన రుచి రహస్యం. మరో విధానం పక్కి దమ్ బిర్యానీ, ఇందులో మాంసం, బియ్యం వేర్వేరుగా ఉడికించి చివరగా పొర్లుగా అమర్చి దమ్ మీద ఉడికిస్తారు.
హైదరాబాద్ బిర్యానీ నిజాం నవాబుల వంటశాలల నుంచి రూపుదిద్దుకున్న మొఘలాయ్-దక్కని క్యూజీన్‌ల సమ్మేళనం. ‘బిర్యానీ’ అన్న పదం పెర్షియన్ భాషలోని ‘వేయించిన’ అనే పదం నుండి వచ్చింది. బాస్మతి బియ్యం, మేక లేదా కోడి మాంసం, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, కుంకుమపువ్వు మరియు ప్రత్యేక మసాలాలతో తయారయ్యే ఈ వంటకం, హైదరాబాద్ (Hyderabad) నగరానికి పర్యాయపదంగా నిలిచింది. చికెన్, మటన్, వెజ్ దమ్ బిర్యానీ వంటి అనేక రకాలలో లభించే ఈ వంటకం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తన రుచితో అలరిస్తూ ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టేజ్‌లో హైదరాబాద్ గౌరవాన్ని పెంచింది.
