అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad city | ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు..’ అని రచయిత అందెశ్రీ రాసినట్లుగా నేటి సమాజం తయారైంది. తోటి మనిషి ఆపదలో ఉన్నా ఆదుకునే వాడే కరువయ్యాడు. మానవత్వం మంటగలిసిపోయిందనడానికి సజీవ సాక్షమే.. నిజామాబాద్ నగరంలో (Nizamabad city) జరిగిన హత్యోదంతం.
నగరం నడిబొడ్డున ఓ కానిస్టేబుల్ (constable) దారుణహత్యకు గురయ్యాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేసి నడి రోడ్డుపై జనాలు చూస్తుండగానే కానిస్టేబుల్‌ను పొడిచి చంపాడు. అయినప్పటికీ ఘటనా స్థలంలో గుమిగూడిన జనం ఏ ఒక్కరూ కూడా అడ్డుకోవడానికి కనీస ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు ఈ దృశ్యాన్ని వీడియోలు తీస్తూ నిల్చుండిపోయారే తప్ప.. పోలీసులు సాయం కోరినా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించడానికి కూడా సహకరించకుండా మానవత్వాన్ని మరిచారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో ఠాణా పరిధిలో ఉన్న వినాయక్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన కానిస్టేబుల్ హత్యోదంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్ (Riyaz) పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు శుక్రవారం రాత్రి కానిస్టేబుల్ ప్రమోద్, సహచర సిబ్బందితో కలిసి వెళ్లాడు.
నిందితుడిని బైక్‌పై ఎక్కించుకుని స్టేషన్‌కు వెళ్తుండగా.. మార్గ మధ్యలో కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. సీసీఎస్ ఎస్సై విఠల్ (CCS SI Vitthal) ఆస్పత్రికి తరలించగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ అంశం ప్రస్తుతం పోలీస్ శాఖతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
Nizamabad city | చోద్యం చూసిన జనం.. సీపీ ఆవేదన
కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న జనం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సైతం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనా స్థలంలో జనం వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.
‘దాడి జరిగిన సమయంలో పోలీసులు సాయం కోరితే ఎవరూ ముందుకు రాలేదు. జనం పక్కనే ఉండి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారే తప్ప ఏ ఒక్కరూ సాయం చేయలేదు. ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఆటోవాలాలూ సహకరించలేదు. పోలీసు అనే కాదు ఎవరైనా సరే ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం సరైందికాదు. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సాయం చేయకుండా వదిలేసి వెళ్తే.. సొసైటీ ఎలా ముందుకు వెళ్తుందని’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.