అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hidma Encounter | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అనేక దాడులకు నాయకత్వం వహించిన హిడ్మా (Hidma) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. బలగాలకు దొరకకుండా గత కొంతకాలంగా హిడ్మా తప్పించుకుంటున్నాడు. అతడి కోసం అనేక ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri Seetharamaraju district) జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించాడు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో (Maredumilli forests) మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Andhra Pradesh DGP Harish Kumar Gupta) ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఐదుగురు మావోయిస్టులు సైతం మరణించారు. వారిలో హిడ్మా భార్య కూడా ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు కీలక నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డు ఉంది. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
Hidma Encounter | అనేక దాడులకు నాయకత్వం
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆయన తల్లి హిడ్మాను ఇంటికి రావాలని కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. అయితే హిడ్మా భద్రతా దళాలు, ప్రజలపై కనీసం 26 సాయుధ దాడులకు నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. అతడి కోసం గతంలో అనేక మార్లు బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పలుమార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ట్రై-జంక్షన్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం అయ్యాడు.
