అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Liquor Policy | రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ఈ రోజు (సోమవారం) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత రెండు సంవత్సరాల పాత పాలసీ ఆదివారం ముగియడంతో, కొత్త లైసెన్సులు పొందిన వ్యాపారులు తమ దుకాణాలను ప్రారంభించేందుకు పూర్తి స్థాయి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు.
ఈ కొత్త పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉండనుంది. ఎక్సైజ్ శాఖ (Excise Department) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023–25 పాత పాలసీ కాలంలో మద్యం అమ్మకాలు ఊహించని స్థాయికి పెరిగాయి. లిక్కర్ అమ్మకాలు: 724 లక్షల కేసులు, బీర్ అమ్మకాలు: 960 లక్షల కేసులు మొత్తంగా అమ్మకాల విలువ: ₹71,550 కోట్లు.
New Liquor Policy | కాసుల వర్షం..
ఇందులో 80% పైగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయంగా చేరింది. 2023 డిసెంబర్‌లో ఒక్క నెలలోనే రూ.4,297 కోట్ల వ్యాపారం జరిగి రికార్డు సృష్టించగా, 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం రూ.37,485 కోట్లు, 2025 జనవరి నుంచి నవంబర్ వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అదనంగా దరఖాస్తు ఫీజులు, లైసెన్స్ ఫీజుల ద్వారా కూడా ప్రభుత్వం భారీ ఆదాయం సాధించింది. పాత పాలసీ కాలంలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిమాండ్ భారీగా పెరిగింది. దీనివల్ల మొత్తం అమ్మకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. ఇక కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
లైసెన్స్ ఫీజు స్లాబ్‌లు
అమ్మకాల స్థాయి ఆధారంగా దుకాణాల లైసెన్స్ ఫీజులు ఐదు స్లాబ్‌లుగా విభజించబడ్డాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో గరిష్ట ఫీజు — రూ.1.10 కోట్లు.
ఇతర స్లాబ్‌లు:
- రూ.85 లక్షలు
- రూ.56 లక్షలు
- రూ.55 లక్షలు
- రూ.50 లక్షలు
ప్రభుత్వం ఇప్పటికే లైసెన్సు ఫీజుల్లో ఆరో వంతు ముందుగానే వసూలు చేసింది. ఈసారి లైసెన్సులు పొందిన వ్యాపారులు సోమవారం నుంచి దుకాణాలను ప్రారంభిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం కొత్త పాలసీ కాలం వ్యాపారులకు మరింత లాభదాయకం కానుంది. ఇందుకు కారణాలు రాబోయే గ్రామ పంచాయతీ, పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు (Corporation Elections), భారీ సంఖ్యలో భక్తులు వచ్చే మేడారం జాతర, వరుస పండుగలు, ఉత్సవాలు. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
