US - EU Trade Deal
US - EU Trade Deal | అమెరియా, ఈయూ మ‌ధ్య భారీ ఒప్పందం.. 750 బిలియ‌న్ డాల‌ర్ల కొనుగోళ్లుకు ఈయూ సిద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US – EU Trade Deal | అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం ఖ‌రారైంది. ఆగ‌స్టు 1 నుంచి 30 శాతం టారిఫ్‌లు అమ‌లులోకి రానున్న త‌రుణంలో ఒప్పందం కుదర‌డంతో ఈయూ దేశాల‌కు ఊర‌ట ల‌భించింది. దీంతో ఈయూ(European Union) దేశాల మ‌ధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాల భ‌యం తొల‌గిపోయింది. రెండు దేశాల మ‌ధ్య ఇది భారీ ఒప్పంద‌మ‌ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్ర‌క‌టించారు. స్కాట్‌లాండ్‌లోని తన గోల్ఫ్ రిసార్ట్‌లో ఈయూ ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లెయన్‌తో చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈయూ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై కనీస సుంకాన్ని 15 శాతంగా నిర్ణయించిన‌ట్లు వెల్ల‌డించారు. ఆగస్టు 1 తరువాత ఈయూ ఉత్పత్తులపై 30 శాతం కనీస సుంకాన్ని విధించేందుకు గతంలో అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఈయూ దేశాలకు భారీ ఊరట దక్కింది.

US – EU Trade Deal | భారీ వాణిజ్య ఒప్పంద‌మ‌న్న ట్రంప్‌..

ఈయూతో జ‌రిగిన ఒప్పందాన్ని ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పంద‌మ‌ని (Trade Agreement) పేర్కొన్నారు. ఇది గతంలో ఎన్నడూ చూడని భారీ వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు. “మేము ఒక ఒప్పందానికి వ‌చ్చాం. ఇది అందరికీ మంచి ఒప్పందం. ఏ హోదాలోనైనా కుదిరిన అతిపెద్ద ఒప్పందం బహుశా ఇదే ” అని ట్రంప్ తెలిపారు. యూరప్‌లోని కీలకమైన ఆటోమొబైల్ (Automobile), ఫార్మాస్యూటికల్స్ (Pharmaceuticals), సెమీకండక్టర్లకు 15 శాతం సుంకం వర్తిస్తుందని తెలిపారు. అమెరికా నుంచి 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాలను కూడా కొనుగోలు చేసేందుకు ఈయూ అంగీకరించిందన్నారు. అమెరికాలో మరో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని వెల్ల‌డించారు. త‌మ మిలిటరీ ఉత్పత్తుల కొనుగోలు కూడా ఈయూ అంగీకరించిందన్నారు.

US – EU Trade Deal | మూడేళ్ల‌లో కొనుగోళ్లు..

రష్యా నుంచి కొనుగోళ్లు త‌గ్గించుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగా అమెరికా నుంచి స‌హ‌జ వాయువు, చ‌మురు, అణుఇంధ‌నాల‌ను దిగుమ‌తి చేసుకోనున్న‌ట్లు ఈయూ ప్రెసిడెంట్ వాన్‌డెర్ లేయ‌ర్ (EU President Ursula Von Der Leyen) తెలిపారు. రాబోయే మూడేళ్లల్లో ఈ కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. 27 సభ్య దేశాలున్న ఈయూ తరపున చర్చల్లో పాల్గొన్న ప్రెసిడెంట్ అర్సులా అమెరికాతో ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఎల్ఎన్‌జీ, చమురు, అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రష్యా ఇంధనాల నుంచి ఇతర వనరులపై మళ్లే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది తమకు ఆమోదయోగ్యమైన ఒప్పందం అని మీడియాతో వ్యాఖ్యానించారు. స్థిరత్వం నెలకొంటుందని, ఇరు దేశాల్లోని వ్యాపారాలకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.

US – EU Trade Deal | స్థిర‌త్వాన్ని తెస్తుంది..

ప్రస్తుతం అమెరికా, ఈయూ మధ్య దాదాపు 1.9 ట్రిలియన్ డాలర్ల వాణిజ్య సంబంధాల‌ను కాపాడుకోవ‌డానికి కృషి చేస్తున్నామ‌ని వాన్ డెర్ లేయ‌ర్ అన్నారు. వాణిజ్య యుద్ధ భ‌యాలు తొల‌గిపోయి రెండు మ‌ధ్య స్థిర‌త్వాన్ని తెస్తుంద‌న్నారు. “ఇది (ఒప్పందం) స్థిరత్వాన్ని తెస్తుంది. ఇది అంచనా వేయగల సామర్థ్యాన్ని తెస్తుంది. అట్లాంటిక్ రెండు వైపులా ఉన్న మా వ్యాపారాలకు ఇది చాలా ముఖ్యం” అని ఆమె చెప్పారు. విమానాలు, కొన్ని రకాల రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర క్రిటికల్ ముడి సరుకులపై ద్వైపాక్షిక పన్ను రాయితీలకు కూడా అంగీకారం కుదిరినట్టు తెలిపారు. మ‌ద్యం వంటి ఉత్ప‌త్తుల‌పై “జీరో-ఫర్-జీరో” ఒప్పందాలను పొందాలని ఆశిస్తున్నట్లు వాన్ డెర్ లేయన్ చెప్పారు. రాబోయే రోజుల్లో వీటిని పరిష్కరించుకుంటామ‌ని ఆశిస్తున్నామ‌న్నారు.