అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | తమిళనాడులో అమానుష ఘటన చోటు చేసుకుంది. బీమా డబ్బుల (insurance money) కోసం కన్న తండ్రిని ఇద్దరు కుమారులు హత్య చేశారు.
ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగింది. డబ్బు, ఆస్తుల కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. కన్నవారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన తమిళనాడులో (Tamil Nadu) చోటు చేసుకుంది. తండ్రి పేరిట బీమా చేయించిన ఇద్దరు కుమారులు, ఆయనున పాము కాటుతో చంపించారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Tamil Nadu | రూ.3 కోట్ల బీమా చేయించి
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు (Tiruvallur district) చెందిన గణేశన్ ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఆయనపై రూ.3 కోట్ల బీమా (insurance policy) చేయించారు. తండ్రిని హత్య చేసి బీమా డబ్బులు సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశారు. తమ మీద అనుమానం రాకుండా హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఓ సారి పామును తీసుకొచ్చి తన తండ్రి ఉన్న గదిలో విడిచి పెట్టారు. అయితే అది విషపూరితమైనది కాకపోవడంతో గణేశన్ ప్రాణాలతో బయటపడ్డారు. మరోసారి అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి నిద్రిస్తున్న వారి తండ్రి మెడపై కాటు వేయించారు. తమ మీద అనుమానం రాకుండా ప్రమాదవశాత్తు పాము కాటు వేసిందని నమ్మించారు. పామును అక్కడే చంపారు.
Tamil Nadu | ఇలా దొరికారు
తండ్రి మరణం తర్వాత బీమా డబ్బుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించారు. క్లెయిమ్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో కంపెనీ ప్రతినిధులు గణేశన్పై అనేక బీమా పాలసీలు ఉండటం గమనించారు. దీంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు కుమారులు కలిసి తండ్రిని చంపినట్లు గుర్తించారు. పాము కాటు తర్వాత కావాలనే తండ్రిని ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారని చెప్పారు. దీంతో గణేశన్ మృతి చెందాడు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు మృతుడి ఇద్దరు కుమారులతో సహా వారికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు.