అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Home Guards | దేశసేవలో హోంగార్డులు నిరంతరం శ్రమిస్తున్నారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. హోంగార్డ్స్ రైసింగ్ డేను శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా హోం గార్డ్స్ నుంచి గౌరవవందనం స్వీకరించి, పరేడ్ కార్యక్రమాన్ని వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1946 డిసెంబర్ 6న ముంబైలో హోమ్ గార్డ్స్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హోంగార్డ్స్ అంటే కేవలం ఒక విభాగం కాదు అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు ఒక దృఢమైన మద్దతు అని సీపీ పేర్కొన్నారు. మన దేశ సరిహద్దులలో సైన్యంతో పాటు.. రాష్ట్రాల్లో విపత్తు నిర్వహణ సంస్థలతో పనిచేస్తున్న హోంగార్డుల సేవలు వెలకట్టలేనివన్నారు.
ఎన్నికల బందోబస్తులు, పండుగల నిర్వహణలో, కోవిడ్-19 (Covid-19) పరిస్థితుల్లో హోంగార్డుల కృషి అనితరసాధ్యమన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహణ, అన్ని సందర్భాల్లో ముందుండి ప్రజలను రక్షించడంలో అమోఘమన్నారు. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో, షీటీం ద్వారా ఆకతాయిల ఆటకట్టించేందుకు, కళాబృందం ద్వారా, డ్రగ్స్ అసాంఘిక శక్తులు, మూఢనమ్మకాలను తొలగించేందుకు హోంగార్డులు అహోరాత్రులు కృషిచేస్తున్నారన్నారు. ఆరుగురు హోంగార్డులకు మెడికల్ గ్రాంట్ కింద రూ.పదివేలు చొప్పున ఒక్కొక్కరికి అందజేశారు. కరోనా సమయంలో 131 మందికి రూ. 5 వేలు చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు.
రోజువారీ భత్యం రూ. 921 నుంచి రూ. 1000కి పెంచబడిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సౌకర్యం (Rajiv Arogyasri medical facility), డబుల్ బెడ్రూం హౌసింగ్ స్కీం అందించే ప్రస్తావన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. వీరి సంక్షేమ చర్యల్లో భాగంగా హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వైద్య బీమా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 20మంది హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డ్స్‌ను కూడా సిబ్బంది అందరికి అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీశ్(హోంగార్డ్స్), శేఖర్ బాబు (ఎంటీవో), శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్పేర్), ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

