అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | మేడారం జాతర సమీపిస్తోంది. మహా జాతర నేపథ్యంలో వారం రోజుల నుంచే మేడారం భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భారీగా రద్దీ నెలకొంది.
మేడారంలో సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jathara) ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారీగా భక్తులు తరలి రానుండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే భక్తుల కోసం హెలికాప్టర్ సేవులు సైతం అందుబాటులోకి వచ్చాయి. గురువారం హెలికాప్టర్ రైడ్స్ ప్రారంభించారు. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. భక్తులను 6 నుంచి 7 నిమిషాలు హెలికాప్టర్లో తిప్పనున్నారు. జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్‌కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జ్ చేయనున్నారు.
Medaram Jathara | ఈ నెల 31 వరకు..
మేడారంలో హెలికాఫ్టర్ సేవలు (Helicopter Services) ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయి. హన్మకొండ నుంచి మేడారం జాతర వీక్షణం అప్ అండ్ డౌన్ కు కలిపి రూ.35,999 ఛార్జ్ చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి. ఆకాశం నుంచి జాతర, అటవీ ప్రాంత అందాలను చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఛార్జీలు అధికం అయిన ప్రకృతి అందాలు, జాతర వైభవం చూడాలనుకునే వారు వీటిని వినియోగించుకోవచ్చు. అలాగే హెలికాప్టర్ ఎక్కాలనే కోరిక ఉన్న వారు సైతం 6–7 నిమిషాల విహంగ వీక్షణం చేయొచ్చు. దీని టికెట్ రేటు సైతం అందుబాటులోనే ఉంది.తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism Department) ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ (Tumbi Airlines) హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హన్మకొండ నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్ట్స్అండ్సైన్స్కాలేజీ గ్రౌండ్స్‌లో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మేడారం తీసుకురావడం, దర్శనం అనంతరం తిరిగి దింపడానికి ఒక్కొక్కరికి రూ.35,999 వసూలు చేయనున్నారు. వివరాలకు కోసం 8530004309, 9676320139 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.