అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi – Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో (Hyderabad House) ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రెండు దేశాల మధ్య 11 కీలక ఒప్పందాలు కుదిరాయి.
ఆరోగ్యం, ఎరువులు, విద్య, ఆహార భద్రత, నౌకాయానం, నిపుణులైన భారత కార్మికుల్ని రష్యాకు వలస పంపడంపై సహకారం వంటి పలు రంగాల్లో ఈ ఒప్పందాలు కొత్త దశకు మార్గం చూపనున్నాయి. అయితే ఈ సమావేశంలో ఒక చిన్న మొక్కనే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మోదీ–పుతిన్‌ల మధ్య ఉన్న టేబుల్‌పై ప్రత్యేకంగా అమర్చిన ఆ మొక్క పేరు హెలికోనియా (Heliconia). ఇది కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు, పాజిటివ్ ఎనర్జీకి (Positive Energy) సూచికగా భావించే ప్రత్యేక ఉష్ణమండల మొక్క.
Modi – Putin | ఆ మొక్కే స్పెషల్ అట్రాక్షన్
అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాల్లో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా, ఒక ప్రతీకాత్మక అర్థంతో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో భారత్–రష్యా సంబంధాల్లో వృద్ధి, శాంతి, పరస్పర సహకారాన్ని సూచించే హెలికోనియాను ఉద్దేశపూర్వకంగానే ఉంచారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్కపై నెటిజన్లు భారీ ఆసక్తి చూపుతున్నారు. హెలికోనియా పూలు భారతీయ వాస్తుశిల్పం, తోటపనిలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటాయి. శక్తివంతమైన ఎరుపు, నారింజ రంగులతో ఇవి శ్రేయస్సు, శుభారంభాల, సమతుల్యత, సామరస్యాల ప్రతీకలుగా భావిస్తారు. దౌత్యపరంగా ఎరుపు రంగు ప్రేమ, స్నేహం, పవిత్రత, బలమైన బంధాలకు సంకేతం.
పైకి పెరుగుతున్న ఆకారం అభివృద్ధి, పురోగతిని సూచిస్తుంది. అందుకే మోదీ–పుతిన్ సమావేశంలో (Modi-Putin Meeting) ఈ మొక్క చర్చలకు సానుకూలత, ప్రశాంతతను అందించేందుకు సెట్టింగ్‌లో భాగమైందని అనుకుంటున్నారు. రెండు దేశాలు కీలక ప్రపంచ అంశాలపై చర్చిస్తున్న సమయంలో సంబంధాలు స్థిరంగా, శాంతియుతంగా ఉన్నాయనే సందేశాన్ని హెలికోనియా ప్రతిబింబించిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మొత్తానికి ఇద్దరు దేశాధినేతల మధ్య ఓ మొక్క హాట్ టాపిక్‌గా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
