అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షం పడుతోంది. శనివారం ఉదయం నుంచే వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (LPA) ఉపరితల ఆవర్తన ద్రోణిగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వరుణుడు తాన ప్రతాపం చూపుతున్నాడు. తెరిపినివ్వకుండా వాన (Rain) పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
Heavy Rains | జలమయమైన రోడ్లు
వర్షాలతో నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో వర్షం పడడంతోనే నగరవాసులు ట్రాఫిక్‌లో నరకం చూశారు. సాయంత్రం మళ్లీ భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.
Heavy Rains | సహాయక చర్యలు
నగరంలో భారీ వర్షం పడుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా (Hydraa), జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అలాగే నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
Heavy Rains | జలాశయాలకు నీరు
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలు అయిన ఉస్మాన్‌సాగర్ (Usman Sagar) (గండిపేట), హిమాయత్ సాగర్ (Himayath Sagar)కు భారీగా వరద వస్తోంది. నగర వాసులకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా.. ప్రస్తుతం 1761 అడుగులకు చేరింది. ఉస్మాన్ సాగర్ నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1782 అడుగులకు నీరు చేరింది. దీంతో త్వరలోనే రెండు జలాశయాల గేట్లు ఎత్తే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.