అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు (Harish Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు సోమవారం హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన ఉదయం 11 గంటలకు విచారణకు వచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, న్యాయవాదులతో కలిసి మాజీ మంత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)కు వచ్చారు. అయితే పోలీసులు హరీశ్‌రావు ఒక్కరినే లోనికి అనుమతించారు. దాదాపు ఐదు గంటలుగా అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
Phone Tapping | సూత్రధారులు ఎవరు
ఓ న్యూస్ ఛానెల్ ఎండీ శ్రవణ్ రావు (MD Shravan Rao) 2023 ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు. శ్రవణ్ రావుతో హరీశ్ రావు ఓ ప్రైవేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సిట్ విచారించింది. హరీశ్ రావు వాట్సాప్ నుంచి కొన్ని నెంబర్లను శ్రవణ్ రావుకు ట్యాపింగ్ కోసం పంపినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎలక్ట్రోరల్ బాండ్స్ (BRS Electoral Bonds) విషయంలో సైతం ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
కాగా హరీశ్‌రావుతో పాటు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన న్యాయవాదులను సైతం అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదం చేశారు. అంతకు ముందు తెలంగాణ భవన్ (Telangana Bhavan)వద్ద సైతం హైడ్రామా చోటు చేసుకుంది. హరీష్ రావుకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే సిట్ విచారణ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.