అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Raana | గత 13 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీకి (Delhi) చెందిన హరీశ్ రాణా తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం తుది నిర్ణయం వెలువరించనుంది.
2018లో పాసివ్ యుథనేసియాను చట్టబద్ధం చేసిన తర్వాత, ఈ అంశంపై వచ్చే అత్యంత కీలకమైన తీర్పుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో (Chandigarh University) సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో హరీశ్ రాణా పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతడికి మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో 100 శాతం అశక్తుడిగా మారాడు. అప్పటి నుంచి అతడు కళ్లు తెరవలేకపోవడం, అవయవాలు కదపలేకపోవడం, ట్యూబుల సహాయంతోనే శ్వాస తీసుకుంటూ, ఆహారం పొందుతూ మృతప్రాయంగా జీవిస్తున్నాడు.
Harish Raana | నేడే తీర్పు..
కొడుకు చికిత్స కోసం హరీశ్ తల్లిదండ్రులు Parents తమ ఆస్తిని అమ్ముకోవాల్సిన స్థితికి చేరి, ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యారు. ఇలాంటి నరకప్రాయమైన జీవితం నుంచి కుమారుడిని విముక్తం చేయాలని భావించిన తల్లిదండ్రులు 2024లో మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హరీశ్ వెంటిలేటర్‌పై లేడనే కారణంతో అప్పట్లో కోర్టు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసు తీవ్రతను గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు తన నివేదికలో హరీశ్ కోలుకునే అవకాశం లేదని, అతడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్పష్టం చేసింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం హరీశ్ (Harish) తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకుంది. “ఈ బాలుడిని ఇలాంటి స్థితిలో కొనసాగించలేం” అని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించి హరీశ్‌కు గౌరవప్రదంగా మరణించే హక్కు కల్పిస్తుందా లేదా అన్న అంశంపై వచ్చే తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. గమనార్హంగా, కారుణ్య మరణంపై దేశంలో న్యాయ చర్చ 2011లో అరుణా షాన్‌బాగ్ కేసుతో మొదలైంది. ఆ తర్వాత 2018లో సుప్రీంకోర్టు “గౌరవప్రదంగా మరణించడం కూడా జీవించే హక్కులో భాగమే” అని వ్యాఖ్యానిస్తూ పాసివ్ యుథనేసియాను చట్టబద్ధం చేసింది. ఇప్పుడు హరీశ్ రాణా కేసులో వచ్చే తీర్పు ఆ న్యాయ సూత్రాలకు మరింత స్పష్టత తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది.