అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Haridwar | దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన హరిద్వార్‌లో (Haridwar) హర్ కీ పౌరీ ఘాట్ పరిసరాల్లో తాజాగా ఏర్పాటు చేసిన బోర్డులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఘాట్‌ల నిర్వహణ బాధ్యతలు చూసే శ్రీ గంగాసభ (Shri Ganga Sabha) ఆధ్వర్యంలో, హర్ కీ పౌరీకి వెళ్లే ప్రధాన మార్గాలు, వంతెనలు, స్తంభాలపై “అహిందూ ప్రవేశ్ నిషేధ్ క్షేత్ర” అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గంగా నదికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలను పరిరక్షించడమే తమ లక్ష్యమని గంగాసభ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతం శతాబ్దాలుగా హిందూ విశ్వాసాలకు కేంద్రబిందువుగా ఉందని, పవిత్రతకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని గంగాసభ అధ్యక్షుడు నితిన్ గౌతమ్ వివరించారు.
Haridwar | హరిద్వార్‌లో వెలిసిన బోర్డులు..
1916 నాటి హరిద్వార్ మున్సిపల్ చట్టాన్ని ప్రస్తావిస్తూ, ఆ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తమ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కొందరు సందర్శకుల ప్రవర్తన సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయిన కొన్ని వీడియోలు, వేషధారణలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, గంగాసభ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే, ఈ నిర్ణయంపై ప్రభుత్వ స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh) ఈ అంశంపై స్పందిస్తూ, గంగాసభతో పాటు వివిధ మత పెద్దలు, అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
చట్టపరమైన అంశాలు, రాజ్యాంగ పరమైన పరిమితులను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అందేవరకు తాము ఎటువంటి చర్యలు తీసుకోలేమని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాబోయే 2027 అర్ధకుంభమేళా దృష్ట్యా హరిద్వార్‌లోని మొత్తం 105 ఘాట్‌లలో ఇలాంటి నిబంధనలను అమలు చేయాలని గంగాసభ (Ganga Sabha) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, హరిద్వార్‌లో ఘాట్‌ల నిర్వహణ, సందర్శకుల నియంత్రణ విషయంలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.