అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) బీఆర్ఎస్ గెలవాల్సిందేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను (Maganti Sunitha) మంచి మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత.. మంగళవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్(KCR)ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమెకు బీఫామ్ (B-form) అందజేశారు. అలాగే, ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందజేశారు.
KCR | దిశానిర్దేశం..
మాగంటి సునీతతో పాటు పార్టీ నేతలతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, మాగంటి గోపినాథ్ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
KCR | రేపు తొలి సెట్ దాఖలు..
కేసీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న సునీత బుధవారం ఒక సెట్ నామినేషన్ (nominations) దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాదాసీదాగానే ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, ఈనెల 19వ తేదీన భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ వేస్తారని తెలిపాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితర ముఖ్య నేతలు హాజరవుతారని పేర్కొన్నాయి.