అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల ధరలు దిగివస్తున్నాయి. రేంజ్ రోవర్(Range Rover) ధర ఏకంగా రూ. 30.4 లక్షలు తగ్గడం గమనార్హం. రేంజ్ రోవర్‌తోపాటు డిఫెండర్, డిస్కవరీ ధరలూ తగ్గాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ శ్లాబ్‌లను మార్చిన విషయం తెలిసిందే. పాత శ్లాబ్‌లలో 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లను కొనసాగిస్తూ 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను తొలగించింది. చిన్న వాహనాలపై పన్నులను 28 శాతంనుంచి 18 శాతానికి తగ్గించగా.. లగ్జరీ కార్లు(Luxury Cars), ఎస్‌యూవీలు, హై ఎండ్ బైక్‌లపై జీఎస్టీని 28 శాతంనుంచి 40 శాతానికి పెంచింది. అయితే గతంలో విధించే 17 నుంచి 22 శాతం సెస్‌ను తొలగించడంతో వీటి ధరలూ పది శాతం వరకు దిగి రానున్నాయి. నూతన శ్లాబ్‌లు ఈనెల 22నుంచి అమలులోకి రానున్నాయి. అయితే అంతకుముందే ఈ రేట్ల కోత ప్రయోజనాన్ని కొనుగోలుదారులకు బదిలీ చేయడంపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్(Tata Motors) యూకే అనుబంధ సంస్థ అయిన జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తన వాహన మోడళ్ల ధరను రూ. 4.5 లక్షల నుంచి రూ.30.4 లక్షల వరకు తగ్గించింది. దీనిని తక్షణమే అమలులోకి తేవడం గమనార్హం. రేంజ్ రోవర్ ధర రూ.4.5 నుంచి రూ. 30.4 లక్షలు, డిఫెండర్(Defender) ధర రూ.7 లక్షలనుంచి రూ. 18.60 లక్షలు, డిస్కవరీ ధర రూ.4.5 లక్షల నుంచి రూ. 9.90 లక్షల మేర తగ్గాయి.
ఈనెల 22 నుంచి : జీఎస్టీ రేట్ల సవరింపు నిర్ణయానికి అనుగుణంగా ఆయా కంపెనీలు ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నాయి. బజాజ్ ఆటో(Bajaj auto), హోండా కార్స్ ఇండియా, వోల్వో కార్ ఇండియా, జీప్ ఇండియా ఈనెల 22 నుంచి ధరలను తగ్గించి విక్రయించనున్నాయి.
వోల్వో కార్ ఇండియా(Volvo Car India) తన వాహన మోడల్(ఐసీఈ) ధరను రూ. 6.9 లక్షల వరకు తగ్గించనుంది. జీప్ ఇండియా వాహన మోడళ్ల ధరలు రూ.1.26 లక్షల నుంచి రూ.4.8 లక్షల వరకు తగ్గనున్నాయి.
హోండా కార్స్ ఇండియాకు చెందిన కాంపాక్ట్ సెడాన్ ధర రూ.95 వేల వరకు, సిటీ మోడల్ ధర రూ.57,500 వరకు, ఎలివేట్ ధర రూ.58,400 వరకు తగ్గనుంది.
కేటీఎం(KTM) మోడల్స్ సహా తమ మోటార్ సైకిళ్ల ధర రూ.20 వేల వరకు, త్రిచక్ర వాహనాల ధర రూ.24 వేల వరకు తగ్గనుంది.