అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సోమవారం 582 స్వయం సహాయక సంఘాలకు రూ. 1,91,83,496 విలువైన చెక్కులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో (Collector Ashish Sangwan) కలిసి పంపిణీ చేశారు.
Shabbir Ali | కుటుంబానికి మహిళ వెన్నెముక
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి మహిళ వెన్నెముక లాంటిదని, ఒక ఇంటి అభివృద్ధి ఆ ఇంటి ఆడపడుచు ఆర్థిక స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను (interest-free loans) అందిస్తోందని తెలిపారు. ఈ నిధులు మహిళల వ్యాపారాలకు, వారి పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి కావాలని ఆకాంక్షించారు.
గతంలో వడ్డీలు కట్టలేక మహిళా సంఘాలు పడ్డ ఇబ్బందులు తనకు తెలుసని, ఇప్పుడు ఆ భయం అవసరం లేదన్నారు. పైసా వడ్డీ లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు. కామారెడ్డిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, మెప్మా ద్వారా ఇలాంటి ఎన్నో పథకాలను నేరుగా మహిళల దరికి చేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్ పాల్గొన్నారు.