అక్షరటుడే, బోధన్: Bodhan MLA | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సోమవారం బోధన్‌లోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి రూ. 1.99 కోట్ల విలువ చేసే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
Bodhan MLA | మొట్టమొదటిసారి వడ్డీలేని రుణం..
పట్టణ మహిళా సంఘాలకు మొట్ట మొదటిసారి తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద నిధులను కేటాయించిందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా ఆర్ధిక పరిపుష్టి సాధించాలని సూచించారు.
మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు (solar power plants), పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ యూనిఫాంల స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి వాటిని సైతం మంజూరు చేస్తోందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు ఇంటి నిర్మాణం కోసం రుణాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఎంబ్రాయిడరీ వర్క్ నైపుణ్యం కలిగి ఉన్న మహిళా సభ్యులకు కుట్టు యంత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Bodhan MLA | మహిళల గౌరవాన్ని పెంచేలా..
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం విస్తృతస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. రుణాలతో పాటు మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తోందన్నారు. ప్రభుత్వ తోడ్పాటును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వడ్డీలేని రుణాలను ఇతర అవసరాలకు మళ్లించకుండా, లాభాలను అందించే వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు.
Bodhan MLA | అంకితభావంతో కృషిచేస్తే..
సరికొత్త ఆలోచనలతో ప్రణాళికాబద్దంగా అంకిత భావంతో కృషిచేస్తే ఆర్థిక విజయాలు సాధించవచ్చని కలెక్టర్ సూచించారు. ఆర్థిక ప్రగతి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధిని సైతం సాధించేలా మహిళలను చైతన్యవంతులను చేయాలని సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. సంఘాల కార్యకలాపాల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలని, తీర్మానాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీఆర్డీఏ సాయాగౌడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డీసీసీ నగేష్ రెడ్డి, పట్టణ మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.