అక్షరటుడే, ఇందూరు : Prajavani | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ (Vanamala Krishna) డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం నిరసన తెలిపారు.
అనంతరం అదనపు కలెక్టర్ (Additional Collector)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేయాలని కోరారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులను సకాలంలో అందించాలన్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులందరికీ జీవన భృతి రూ.4 వేలు, వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలన్నారు.
తడిసిన వరి, మొక్కజొన్న, పత్తి, సోయాతో పాటు అన్ని పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. హామీలను అమలు చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేందర్, నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శి వెంకన్న, రాజేశ్వర్, నగర కార్యదర్శి సుధాకర్, నాయకులు గంగాధర్, మల్లేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
