అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. పాలన చేతగాక పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటన్నారు.
ఇటీవల ఓ టీవీ ఛానెల్లో ఐఏఎస్ అధికారిణి (IAS Officer)పై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సదరు ఛానెల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం ప్రసారమైన కథనంపై సదరు ఛానెల్ యాజమాన్యం క్షమాపణలు సైతం చెప్పింది. అయినా కూడా ప్రభుత్వం జర్నలిస్టులను (Journalists) అరెస్ట్ చేసింది. దీనిపై బుధవారం మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
Harish Rao | జర్నలిస్టులను బలి చేస్తారా
మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అన్నారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను ఆయన ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) చేస్తున్న దాడి అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) దాడి చేస్తోందని విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియాపై సిట్లు ఏర్పాటు చేసి ఎవరిని కాపాడుతున్నారని ప్రశ్నించారు.
Harish Rao | తక్షణం విడుదల చేయాలి
అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన డీజీపీతో మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అన్నారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు.