అక్షరటుడే, వెబ్డెస్క్ : Govt Employees | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ తీపి కబురు చెప్పడానికి సిద్ధం అవుతోంది. ఉద్యోగులకు భారీ మొత్తంలో ప్రమాద, ఆరోగ్య బీమా అందించాలని భావిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించడానికి బీమా సౌకర్యం (Insurance Facility) కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా (Accident Insurance) కల్పించాలని యోచిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ మొత్తం వారి కుటుంబాలకు అందనుంది. ఈ మేరకు బ్యాంకులు, బీమా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చలు కొలిక్కి వస్తే బీమాపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Govt Employees | సింగరేణి స్ఫూర్తితో..
సింగరేణి సంస్థలో ఉద్యోగులు, కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి రూ.కోటి బీమా అందిస్తున్నారు. ఈ పథకం స్ఫూర్తితోనే ఉద్యోగులకు సైతం బీమా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా అందిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) సైతం రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.కోటి బీమా అందిస్తున్నారు. దీంతో కేంద్రం కంటే మెరుగ్గా బీమా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ఉద్యోగుల బీమా విషయంలో కొన్ని బ్యాంకులు ఇప్పటికే అనేక రాయితీలు ఇచ్చేందుకు ఓకే చెప్పాయన్నారు. అయితే ఇంకా ఎక్కువ బీమా కోసం చర్చలు చేస్తున్నట్లు చెప్పారు.
Govt Employees | ఆరోగ్య బీమా సైతం..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (Employee Health Scheme) అమలు చేస్తోంది. అయితే దీనిపై ఉద్యోగులు సంతృప్తిగా లేరు. తమకు మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. కావాలంటే తాము కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తాం అంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులకు రూ.30 లక్షల వరకు ఆరోగ్య బీమాల కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీనికి ఉద్యోగులు దాదాపు రూ.2,495 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై త్వరలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.