అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి పట్టణ సుందరీకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) విద్యానగర్ కాలనీ, చోటా కసాబ్ గల్లీలో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యానగర్ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకల సమస్యలు తొలగి, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. చోటా కసాబ్ గల్లీ ప్రాంతం ఎన్నాళ్లుగానో మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని.. పట్టణం అయినా, గ్రామమైనా సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి మార్గదర్శకమని చెప్పారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ప్రాంతాలను గుర్తించి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
Shabbir Ali | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 82 మంది బాధిత కుటుంబాలకు రూ.50లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం బారినపడి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే సంబంధిత బిల్లు ఒరిజినల్ పత్రాలు పార్టీ కార్యాలయంలో అందజేస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని తెలిపారు.