అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Employees | పండుగల సీజన్‌కు ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం (సెప్టెంబర్ 24) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే శాఖ ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) చెల్లింపునకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం ప్రకారం దసరా, దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా 10,91,146 మంది రైల్వే ఉద్యోగులకు(Railway Employees) బోనస్ అందనుంది. ఇది గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగులు సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది.
బోనస్ వివరాలు చూస్తే..
- బోనస్ కాలపరిమితి: 78 రోజులు
- లబ్ధిదారుల సంఖ్య: 10.91 లక్షలమంది
- ఖర్చు మొత్తం: రూ. 1,865.68 కోట్లు
- బోనస్ పరిమితి (గరిష్ఠంగా): ఒక ఉద్యోగికి సగటున రూ. 17,951 చొప్పున
- కేటగిరీలు: గ్రూప్ C, గ్రూప్ D విభాగాలకు వర్తిస్తుంది.
Railway Employees | మంత్రివర్గం ప్రకటనలో ఏమున్నది..?
కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఈ విషయాలను వెల్లడించారు. “భారత రైల్వేలను ముందుకు నడిపించడంలో రైల్వే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. వారి అంకితభావం, అద్భుతమైన పనితీరు గుర్తించాల్సిన సమయం ఇది. అందుకే ప్రభుత్వం 78 రోజుల బోనస్ ప్రకటించింది” అని మంత్రి చెప్పారు. అయితే, ఇది కొత్తగా అందించే ప్రయోజనం కాదు. గత సంవత్సరాల్లో కూడా రైల్వే ఉద్యోగులకు ఇదే విధంగా 78 రోజుల బోనస్ చెల్లించారు. ప్రభుత్వం తరఫున ఇది ఉద్యోగుల్లో నూతనోత్సాహం, పని పట్ల ప్రేరణ పెంచే చర్యగా తీసుకుంటున్నారు.
ఈ కేబినెట్ భేటీలో మరో ముఖ్యాంశం ఏమిటంటే, బీహార్ రాష్ట్రానికి పలు కేంద్ర పథకాల ప్రకటనలు, మంజూరులు కూడా వెలువడ్డాయి. త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రంగా బిహార్ కేంద్రానికి కీలకమైన రాష్ట్రంగా మారిన వేళ, కేంద్ర ప్రభుత్వం (Central Government) వరుస ప్రకటనలు చేస్తోంది. ఈ బోనస్ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడమే కాదు, పండుగ సమయాల్లో కుటుంబంతో ఆనందంగా గడిపేలా చేయడం ముఖ్య లక్ష్యం. “మంచి పనికి గుర్తింపు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ధోరణి” అని రైల్వే శాఖ మంత్రి వ్యాఖ్యానించారు.