Homeఅంతర్జాతీయంMalaysia | మలేషియాలో చిక్కుకున్న కార్మికులకు గుడ్​న్యూస్​.. ఇళ్లకు పంపే చర్యలు చేపట్టిన అక్కడి ప్రభుత్వం

Malaysia | మలేషియాలో చిక్కుకున్న కార్మికులకు గుడ్​న్యూస్​.. ఇళ్లకు పంపే చర్యలు చేపట్టిన అక్కడి ప్రభుత్వం

మలేషియాలో చిక్కుకున్న కార్మికులను స్వదేశాలకు పంపడానికి అక్కడి ప్రభుత్వం మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 చేపట్టింది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కల్పించాలని ఎఫ్​ఎన్​సీఏ ప్రతినిధులు ఎంపీ ఈటల రాజేందర్​ను కోరారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malaysia | మలేషియా ప్రభుత్వం మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM2.0) ప్రారంభించినట్లు మలేషియాలోని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ (FNCA) తెలిపింది. డాక్యుమెంట్ లేని వలస కార్మికులకు జైలు శిక్ష, భారీ జరిమానాలను ఎదుర్కోకుండా చట్టబద్ధంగా సురక్షితంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగ పడుతుందన్నారు.

భారత్​కు చెందిన ఎంతో మంది కార్మికులు మలేషియాలో చిక్కుకుపోయారు. ఇందులో అధిక సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో చాలా మంది ఏజెంట్లచేత మోసపోయి, విజిట్ వీసాలపై మలేషియాకు వచ్చి, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా చిక్కుకుపోయారు.

Malaysia | రూ.10 వేలు చెల్లించి..

పీఆర్ఎం 2.0 కార్యక్రమం 2025 మే 19 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా డాక్యుమెంట్ లేని కార్మికులు నామమాత్రమైన జరిమానా RM 500 (సుమారు రూ.10వేలు) చెల్లించడం ద్వారా తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేని వారు మలేషియాలోని భారత హై కమిషన్ (High Commission of India) నుంచి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్‌లను పొందడం ద్వారా తిరిగి స్వదేశానికి వెళ్లవచ్చు.

Malaysia | అండగా ఆ సంస్థలు

మలేషియాలో చిక్కుకున్న భారతీయులకు ఎఫ్‌ఎన్‌సీఏ-మలేషియా, తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వంటి సంస్థలు అండగా నిలుస్తున్నారు. ఈ అమ్నెస్టీ ప్రక్రియ ద్వారా బాధిత కార్మికులు స్వదేశానికి వెళ్లేలా ఈ సంస్థలు మార్గనిర్దేశం చేస్తున్నాయి.

Malaysia | ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి

మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 గురించి తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కల్పించాలని ఎఫ్ఎన్​సీఏ కోరింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) మలేషియాలో పర్యటించిన సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి దీనిపై లేఖ అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం గురించి వివరించి బాధితులు ఇళ్లకు చేరేలా సాయం చేయాలని కోరారు.

కార్మికుల సురక్షిత రిటర్న్‌ను నిర్ధారించడానికి సమన్వయ ప్రయత్నాల అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గడువు ముగిసే లోపు బాధిత వ్యక్తులు, వారి కుటుంబాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం, భారత హై కమిషన్, సముదాయ సంస్థల మధ్య సహకారం ద్వారా ఈ కార్మికులను వారి స్వస్థానాలకు పంపే ఏర్పాటును సులభతరం చేయాలని కోరారు.