అక్షరటుడే, వెబ్డెస్క్ : Finance Commission Funds | గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,500 కోట్ల విడుదలకు ఓకే చెప్పింది.
రాష్ట్రంలో పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఇన్ని రోజులు కేంద్రం నుంచి నిధులు ఆగిపోయిన విషయం తెలిసిందే. 2024 జనవరిలో సర్పంచ్లు పదవీకాలం ముగియగా.. మొన్నటి వరకు ప్రత్యేకాధిరుల పాలన సాగింది. దీంతో 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. అనంతరం నిధులు ఆగిపోయాయి. ఈ క్రమంలో కేంద్ర నిధుల కోసం ప్రభుత్వం ఇటీవల పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) నిర్వహించింది.
Finance Commission Funds | త్వరలో వెయ్యి కోట్లు
కొత్తగా కొలువుదీరిన సర్పంచులకు కేంద్రం (Central Government) తాజాగా శభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నెలాఖరులోగా రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపింది. మిగతా రూ.1500 కోట్లు ఫిబ్రవరిలో పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. ఇన్ని రోజులు ఆగిపోయిన నిధల విషయమై రాష్ట్ర అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించామని, నిధులు విడుదల చేయాలని కోరారు. దీంతో కేంద్రం చర్యలు చేపట్టింది.
Finance Commission Funds | ప్రత్యేక ఖాతాలో..
నిధుల విడుదల కోసం కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం జీపీలు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించింది. ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొంది. నిధుల వినియోగం కోసం సర్పంచ్, ఉప సర్పంచ్ డిజిటల్ సంతకాలు చేసి ఎంపీడీవో అనుమతి పొందాలని తెలిపింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) సైతం పంచాయతీలకు మంగళవారం రూ.277 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. నిధులు లేకపోవడంతో జీపీ కార్యదర్శులు పనులు చేపట్టలేదు. దీంతో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా వచ్చిన సర్పంచులు చాలా పనులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల చేయడం, కేంద్రం సైతం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇస్తామని చెప్పడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.