అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CP Sajjanar | నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడించారు. వారి సంక్షేమం కోసం త్వరలోనే సిటీ పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా ‘హోంగార్డ్ కో-ఆపరేటివ్ సొసైటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
నగరంలోని పేట్లబురుజులోని సీఏఆర్ (CAR) హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హోం గార్డ్స్ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనర్ గౌరవ వందనం స్వీకరించారు. నగరంలో సుమారు 5 వేల మంది హోంగార్డులు పనిచేస్తున్నారని చెప్పారు. హోంగార్డుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కో-ఆపరేటివ్ సొసైటీలో ఇప్పటికే 2 వేల మంది చేరారని, మిగిలిన వారు కూడా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.
CP Sajjanar | డబుల్ ఇళ్లు
అర్హులైన హోంగార్డులకు డబుల్ బెడ్రూం ఇళ్లు (Double Bed Room Houses) మంజూరు చేసే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. హోంగార్డులు డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతి, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం పరేడ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారితో పాటు, విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 25 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలోనూ, ఇతర కారణాలతోనూ మృతిచెందిన 18 మంది హోంగార్డుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.
