అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | సంకాంత్రి పండుగ (Sankranthi Festival) వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు మరో డీఏ ఇవ్వనున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉద్యోగుల డైరీని సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. తాము ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తుంటే.. అది చూసి ఓర్వలేక ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫామ్‌హౌజ్ (Farmhouse)లో శుక్రాచార్యుడు లాంటి వ్యక్తి ఉన్నారని వ్యాఖ్యానించారు. తాము యజ్ఞాలు చేస్తుంటే మారీచులు అడ్డంకులు సృష్టించినట్లు సృష్టిస్తున్నారన్నారు. ప్రజలు వారిని పదే పదే తిరస్కరిస్తున్నా మార్పు రావడం లేదన్నారు.
CM Revanth Reddy | అప్పులకు వడ్డీలు కడుతూ..
బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడంతో పాటు.. ప్రజలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు మంచి చేద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రేవంత్ అన్నారు. కానీ కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని తెలిపారు.
CM Revanth Reddy | ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి
తాము నిర్ణయాలు మాత్రమే తీసుకుంటామని.. అమలు చేయాల్సింది ఉద్యోగులే అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నా, చెడ్డపేరు తీసుకురావాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో కొంతమందికి నేనంటే ఇష్టం లేకపోయినా.. మనందరం కలిసి పనిచేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. పెద్ద మనసు చేసుకుని సహకరించాలని కోరారు. ప్రస్తుతం పెంచనున్న డీఏ వల్ల ప్రభుత్వంపై రూ. 227 కోట్ల భారం పడనుందని తెలిపారు. అయినా కూడా ఉద్యోగుల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.