అక్షరటుడే, వెబ్డెస్క్ : Sabarimala Yatra | అయ్యప్ప స్వాములకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇరుముడితో విమాన ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ప్రకటన చేశారు.
అయ్యప్ప స్వాములు (Ayyappa Swamulu) ఇరుముడిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. 41 రోజులు కఠిన దీక్ష చేపట్టి ఇరుముడితో శబరిమల (Sabarimala)కు వెళ్తారు. అయితే విమానాల్లో వెళ్లే స్వాములు ఇన్ని రోజులు ఇరుముడికి చెక్ఇన్ లగేజీ నిబంధన ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. భక్తుల ఇరుముడి ఉంచిన బ్యాగులను చెక్-ఇన్ ప్రక్రియలో షూస్ వేసుకున్న విమానాశ్రయ సిబ్బంది చెక్ చేసేవారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీక్ష చేసిన స్వాములు సైతం ఇరుముడిని ఎత్తకూడదని, అలాంటిది షూస్ వేసుకున్న సిబ్బంది ఇరుముడి (Irumudi) బ్యాగులను పట్టుకోవడం పవిత్రతకు భంగం కలిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sabarimala Yatra | భక్తుల విజ్ఞప్తి మేరకు..
ఇరుముడి పవిత్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోఆరు. చెక్-ఇన్ బ్యాగేజీగా కాకుండా, క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు భక్తల విజ్ఞప్తి మేరకు విమాన ప్రయాణంలో ఇరుముడిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా పంపాలన్న నిబంధన తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ వెసులుబాటు జనవరి 20 వరకు వర్తిస్తుందని విమానయాన శాఖ (Aviation Department) తెలిపింది. దీంతో అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sabarimala Yatra | భద్రతా చర్యలు చేపడుతూనే..
అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడి పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భక్తులు ఇరుముడిని తమతోపాటు విమానంలో తీసుకెళ్లేలా అనుమతి ఇచ్చామన్నారు. అన్ని భద్రతా చర్యలు చేపడుతూనే.. భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టామన్నారు.
