అక్షరటుడే, వెబ్డెస్క్: Gold and Silver Prices | జనవరి 14వ తేదీ భోగి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు (Silver Prices )భారీగా పెరిగాయి. పండగ వేళ కొనుగోళ్లకు సిద్ధమవుతున్న వినియోగదారులకు ఈ ధరల పెరుగుదల గట్టి షాక్ ఇస్తుంది. ముఖ్యంగా బంగారం ధరలు ఒక్కరోజులోనే నాలుగు అంకెల పెరుగుదల నమోదు చేయడం గమనార్హం.
తాజా ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,090 మేర పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.1,000 వరకు ఎగబాకింది. ఈ పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,770కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,800గా కొనసాగుతోంది.
Gold and Silver Prices | అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ (International Market)లో బంగారం స్పాట్ ధర ఔన్సుకు 4,586.49 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ (Hyderabad)తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,620గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,650గా ఉంది. పండగ సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లపై ఈ ధరల ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇక వెండి ధరలు (Silver Rate) కూడా వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఒక్కరోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది. ఈ పెరుగుదలతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,07,000కు చేరింది. ఇతర ప్రాంతాల్లో వెండి ధరలు కిలోకు సుమారు రూ.2,90,000 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల పరంగా బంగారం భద్రమైన ఆస్తిగా భావించబడుతుండటంతో డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు. “డిసెంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, జనవరిలో ఫెడ్ యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది. మార్కెట్ ప్రస్తుతం ఫెడ్ స్వతంత్రత మరియు ఉపాధి రంగంలోని మార్పులపై దృష్టి పెట్టింది” అని ఎమ్‌కే గ్లోబల్ లీడ్ ఎకనమిస్ట్ మాధవీ అరోరా వివరించారు.