అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రామారెడ్డి మండల కేంద్రంలో (Ramareddy Mandal) ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని వెంబడించి పట్టుకుని విచారించగా ఎటువంటి అనుమతి లేని జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, వైర్లను తరలిస్తున్నట్టుగా గుర్తించారు.
SP Rajesh Chandra | నిజామాబాద్ జిల్లా నందిపేట్..
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నందిపేటకు చెందిన వరికుప్పల నర్సింలు అనే వ్యక్తి నుంచి డిటోనేటర్లు కొనుగోలు చేసి గాంధారి మండలంలోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాళ్లను పేల్చేందుకు తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది. దీంతో పేలుడు పదార్థాలు తరలిస్తున్న కామారెడ్డి మండలం (Kamareddy Mandal) గర్గుల్ గ్రామానికి చెందిన రాజు, ఛత్తీస్ఘడ్ రాష్ట్రం మౌలమవ్ పూర్కు చెందిన చౌకి, పనర్వాణి గ్రామానికి చెందిన శేషులాల్లను అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలు విక్రయించిన వ్యక్తి వద్ద 5 వేలకు పైగా ఉన్న జిలిటీన్ స్టిక్స్ ఉన్న మ్యాగ్జిన్ లభించిందని, వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల వద్ద 50 జిలెటిన్ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 52 మీటర్ల వైరు, ఒక బైక్, మొబైల్, స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే విక్రయించిన వ్యక్తి నర్సింలు వద్ద 20 జిలెటిన్ స్టిక్స్, 4 డిటోనేటర్లు, 5 మీటర్ల వైర్, లాగ్ బుక్స్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
విచారణలో పేలుడు పదార్థాల లైసెన్స్ ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం (Armoor Mandal) ఒరుసు సాయి మల్లు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. తప్పించుకుని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్న హోంగార్డును ఎస్పీ అభినందించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), కామారెడ్డి రూరల్ సీఐ రామన్ (Kamareddy Rural CI Raman), మాచారెడ్డి ఎస్సై అనిల్ (Machareddy SI Anil) పాల్గొన్నారు.
