అక్షరటుడే, కామారెడ్డి : Kalvakuntla Kavitha | నాగమడుగు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ పథకం రూ. 430 కోట్లతో ప్రారంభమైందని.. ఇప్పటికి మూడో వంతు నిధులు కూడా ఇవ్వలేదన్నారు.
వెంటనే పనులు పూర్తవడానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు (Nagamadugula) ఎత్తిపోతల పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal Constituency) సాగు నీరు ఇచ్చే వ్యవస్థ చాలా తక్కువగా ఉందన్నారు. ఇక్కడ నిజాంసాగర్ ఉన్నప్పటికీ దాని ద్వారా జుక్కల్‌కు ప్రయోజనం లేని పరిస్థితి నెలకొందన్నారు. జుక్కల్‌లో చెరువుల ద్వారా 22 వేల ఎకరాలు, కౌలాస్ నాలా ద్వారా 9 వేల ఎకరాలు సాగు అవుతోందని తెలిపారు. మహారాష్ట్రతో పంచాయతీ కారణంగా లెండి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి పూర్తి కాకుండా ఉందన్నారు.
Kalvakuntla Kavitha | 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు
జుక్కల్‌లో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నాగమడుగు లిఫ్ట్ ప్లాన్ చేశారని చెప్పారు. మంజీర నది నుంచి నీటిని ఎత్తిపోసుకోవాలని, అందుకోసం దాదాపు 2 వందల ఎకరాలపై పైగా భూ సేకరణ అవసరమన్నారు. అయితే పంప్ హౌస్‌కు కావాల్సిన 12 ఎకరాలు మాత్రమే సేకరించారని, కరకట్ట, చెక్ డ్యాం కోసం 200 ఎకరాల భూ సేకరణ అవసరమైతే గుంట కూడా సేకరించలేదన్నారు. పైగా రాళ్లు అడ్డం పెట్టి నిర్మాణాలు మొదలు పెట్టారని తెలిపారు. ఫలితంగా ఇక్కడి మూడు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమకు నీళ్లు రావని కూడా ఇక్కడి ప్రజలు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలతో డీపీఆర్ ఉంచాలని, ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో స్పష్టంగా చెప్పాల్సిన అవసరముందన్నారు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా డీపీఆర్ సిద్ధం చేయలేదని చెప్పారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా (Congress Government) ఈ పని చేయాలని సూచించారు.
Kalvakuntla Kavitha | రైతుల నష్టపరిహారంపై క్లారిటీ ఇవ్వాలి
వడ్డేపల్లి పంప్ హౌస్ పనులను ఏళ్లుగా పెండింగ్ పెట్టారని కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. తమ కార్యక్రమం ఉందని తెలిసి రెండు రోజుల క్రితమే క్లీన్ చేసి మోటార్లు ఆన్ చేశారన్నారు. అంతకుముందు పూర్తిగా పంప్ హౌస్‌లను బంద్ పెట్టిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. పనుల పేరు చెప్పి హేవీ వెహికల్స్ వస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. చాలా మంది రైతులు ప్రాజెక్ట్ కారణంగా అర, పావు ఎకరం భూమి కోల్పోతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి రైతుల బాధను చూడాలని, రైతులకు ఏం నష్ట పరిహారం ఇస్తారో చెప్పాల్సి ఉందన్నారు. గతంలో ఎకరానికి రూ. 17 లక్షలు ఇచ్చారని, ఇప్పుడు ధరలు పెరిగాయని, ఎకరానికి ఎకరం భూమి ఇవ్వాలి.. లేదా ఎకరానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని రైతులు అడుగుతున్నారని పేర్కొన్నారు.
రూ. 430 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటి వరకు మూడో వంతు నిధులు కూడా ఇవ్వలేదని, ఆగమాగం నిధులు కేటాయిస్తూ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా అయితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యను మేం ఇక్కడితో వదిలిపెట్టబోమని, కచ్చితంగా ఫాలో అప్ చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. అవసరమైతే రైతులతో కలిసి ఇరిగేషన్ మంత్రి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.