అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India Captain | భారత్–దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ నెల నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా ఆటగాడు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పాల్గొనే అవకాశం చాలా తక్కువగా ఉందని జట్టు వర్గాలు సూచిస్తున్నాయి.
మెడ నొప్పితో బాధపడుతున్న గిల్‌కు వైద్యులు మరింత విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో గిల్ గైర్హాజరయితే భారత జట్టుకు నాయకత్వం ఎవరు వహిస్తారనే ప్రశ్న అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది.
టీమ్ ఇండియాకు (Team India) ప్రస్తుతం నాయకత్వంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు టీమిండియాని నడిపించనున్నారు. ఆ ఆరు ఎంపికలని పరిశీలిస్తే..
1. రోహిత్ శర్మ
భారత్‌కు అత్యంత విజయవంతమైన వన్డే కెప్టెన్లలో రోహిత్ శర్మ (Rohit Sharma) ముందున్నాడు. 56 వన్డేలకి కెప్టెన్‌గా వ్యవహరించగా, ఇందులో భారత్ 42 విజయాలు సాధించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతడు నాయకత్వం వహించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
2. విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (Virat Kohli) నాయకత్వంలో భారత జట్టు వన్డేల్లో మంచి విజయాలు సాధించింది. 95 వన్డేలకు కోహ్లీ నాయకత్వం వహించగా, ఇందులో భారత్ 65 విజయాలు సాధించింది. తాత్కాలిక కెప్టెన్సీ కోసం కోహ్లీ పేరును పరిశీలించొచ్చు.
3. కేఎల్ రాహుల్
వన్డే కెప్టెన్సీ అనుభవం కలిగిన మరో ఆటగాడు రాహుల్ (KL Rahul). 12 వన్డేలకు నాయకత్వం వహించగా, ఇందులో భారత్ 8 విజయాలు సాధించింది. వికెట్ కీపర్–బ్యాటర్‌గా నిలకడైన ప్రదర్శన, శాంత స్వభావం అతడిని కెప్టెన్సీ రేసులోకి తీసుకొస్తున్నాయి.
4. రిషబ్ పంత్
గిల్ ఆడకపోతే, పంత్ (Rishabh Pant) కూడా కెప్టెన్ ఎంపికలో ఒక కీలక పేరుగా మారనుంది. భారత టీ20 కెప్టెన్సీ అనుభవం, ప్రస్తుత టెస్ట్ వైస్ కెప్టెన్, అగ్రెసివ్ లీడర్షిప్ స్టైల్ ఈ సిరీస్‌కు ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
5. హార్దిక్ పాండ్యా
హార్దిక్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు వన్డేలో ఓటమి చూడలేదు. 3 వన్డేలకు నాయకత్వం వహించగా 3 విజయాలు సాధించింది. ఆల్‌రౌండర్‌గా అతడి ఇంపాక్ట్, జట్టులో అతని ప్రభావం పాండ్యాను కెప్టెన్‌గా చూడొచ్చని సూచిస్తోంది.
6. శ్రేయస్ అయ్యర్
గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నవంబర్ 30 నాటికి పూర్తి ఫిట్‌గా ఉంటే, వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న అతడే కెప్టెన్ అవుతాడని క్రీడా వర్గాలలో చర్చ నడుస్తోంది.
శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అందుబాటులో లేకపోతే, బీసీసీఐ పరిస్థితి, ఫిట్‌నెస్‌ను, జట్టు కాంబినేషన్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. రోహిత్–కోహ్లీ వంటి సీనియర్ ఎంపికలు అందుబాటులో ఉండగా, రాహుల్–పంత్–హార్దిక్–అయ్యర్ కూడా బలమైన ప్రత్యామ్నాయాలే. భారత్ పిచ్‌లు బ్యాట్స్‌మన్‌లకు చాలా అనుకూలంగా ఉండనున్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. టీమిండియా నాయకుడు ఎవరో మరి కొన్ని రోజుల్లోనే తేలనుంది.
