అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పదవుల కోసం పార్టీలు వేస్తున్న వేషాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తెల్లారిలేస్తే విమర్శలు, ఆరోపణలతో మాటల యుద్ధం చేసుకునే ప్రధాన పక్షాలు పల్లె పోరులో మాత్రం స్నేహగీతం పాడుతున్నాయి.
రాజకీయ శత్రుత్వాన్ని మరిచి అధికారం కోసం ప్రత్యర్థులతో దోస్తీ చేస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ పదవులను పంచుకుంటూ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఇంకొన్ని చోట్ల బీజేపీ క్యాండిడేట్లకు (BJP Candidates) హస్తం నేతలు మద్దతుగా నిలుస్తున్నారు.
Local Body Elections | పదవుల పంపకం..
ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఏర్పడుతున్న దోస్తీ చర్చనీయాంశంగా మారింది. పార్టీల మధ్య పదవుల పంపకం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని చోట్ల అధికార పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు విపక్ష పార్టీలు జత కడితే, మరికొన్నిచోట్ల బీఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థిని మట్టి కరిపించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేతులు కలపడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ పోరుతో పాటు త్వరలో నిర్వహించినున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో (ZPTC Elections) పరస్పరం సహకరించుకోవాలని ప్రధాన పార్టీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. సర్పంచ్‌గా తమకు అవకాశం కల్పిస్తే, ఎంపీటీసీ ఎన్నికల్లో మీకు సహకరిస్తామని ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే చర్చలు జరుపుతున్నారు.
Local Body Elections | పరస్పర సహకారం
లింగంపేట మండలం (Lingampet Mandal) మోతె గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏలేటి విజయ బరిలో నిలిచారు. అయితే, ఆమెను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమయ్యాయి. ఇందుకోసం సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. అదే సమయంలో త్వరలో జరుగనున్న ఎంపీటీసీ ఎన్నికల్లో (MPTC Elections) గులాబీ పార్టీ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఇలా ఒక్క మోతె గ్రామంలోనే కాదు, చాలా పల్లెల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. అటు మాక్లూర్ మండలంలో ఒకటి, రెండు గ్రామాల్లో కూడా పార్టీలు సహకరించుకుంటున్నాయి.
