అక్షరటుడే, వర్ని: MLA Pocharam | దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణలోనే (Telangana) వందశాతం సబ్సిడీతో చేప విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం (Varni Mandal) జలాల్‌పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం (World Fisheries Day) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మత్స్యకారులు స్వయంగా చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో, దళారులు పెట్టుబడులు పెట్టి చెరువులపై పట్టు సాధించేవారన్నారు.
ఫలితంగా మత్స్యకారుల శ్రమ దోపిడీకి గురయ్యేవారని లాభాలు దళారులకే చేరేవని ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి మత్స్యకారులు దళారులకు చేపలను అమ్మకుండా, స్వయంగా గ్రామాలు, పట్టణాల్లో తిరిగి విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఫిషరీస్ మాజీ అదనపు డైరెక్టర్ శంకర్ నాయక్ రాథోడ్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.
