అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu | తమిళనాడులో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికారం కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఏఐడీఎంకే (AIADMK) ఐదు హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly elections) ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంతో తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను ఏఐడీఎంకే ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే పురుషులకు ఉచిత బస్సు (free bus) ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పళని స్వామి పేర్కొన్నారు. కాగా ఆ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోంది. దానిని అలాగే కొనసాగిస్తామని ప్రకటించారు. అలాగే మహిళలకు నెలకు రూ.2,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామన్నారు.
Tamil Nadu | అమ్మ ఇల్లం పథకం
గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి కాంక్రీట్ ఇళ్లను నిర్మించి ఇస్తామని పళని స్వామి పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో, సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి అపార్ట్‌మెంట్ భవనాలను నిర్మించి, వాటిని ఉచితంగా అందిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో పని దినాలను 150 రోజులకు పెంచుతామన్నారు. అమ్మ టూ-వీలర్ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్రవాహనాలకు రూ.25 వేల చొప్పున సబ్సిడి ఇస్తామన్నారు.
Tamil Nadu | తీవ్ర పోటీ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. డీఎంకే తన అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుంది. ఎలాగైన ఈ సారి విజయం సాధించాలని బీజేపీ, ఏఐడీఎంకే చూస్తున్నాయి. మరోవైపు సినీ నటుడు విజయ్ (TVK Chief Vijay) స్థాపించిన టీవీకే పార్టీ సైతం అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. దీంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.