అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’ (Fraud ka full stop) కార్యక్రమం ప్రారంభించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని వరుసగా ఆరు వారాల పాటు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, ఆన్లైన్ గేమ్స్ ఆడితే కలిగే నష్టాలు, అపరిచిత వ్యక్తులు ఓటీపీ అడిగితే వ్యవహరించే తీరు, డిజిటల్ అరెస్ట్ తదితర విషయాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఒకవేళ సైబర్ మోసానికి (cyber fraud) గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజలు, యువత, విద్యార్థుల్లో మార్పు తెచ్చేవిధంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (CCPS) ఇన్‌స్పెక్టర్ ముఖిద్ పాషా, సీటీసీ ఇన్‌స్పెక్టర్ శివరాం, ఎస్ఐపీ ప్రవళిక, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
