HomeతెలంగాణCryptocurrency Fraud | క్రిప్టో కరెన్సీ పేరిట మోసం.. రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Cryptocurrency Fraud | క్రిప్టో కరెన్సీ పేరిట మోసం.. రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cryptocurrency Fraud | క్రిప్టో కరెన్సీ పేరిట మోసాలు ఆగడం లేదు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి పలువురు ప్రజల డబ్బులను కాజేస్తున్నారు. ఇటీవల కరీంనగర్​(Karim Nagar) కేంద్రంగా పలువురిని మోసం చేసిన నిందితుడిని రాచకొండ​ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు.

క్రిప్టో కరెన్సీ(Crypto Currency) పేరిట నాలుగు యాప్​ల ద్వారా నిందితుడు రూ.300 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.ముంబయికి చెందిన హిమాంశు సింగ్ క్రిప్టో కరెన్సీ పేరిట ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడు. తమ యాప్​లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించేవాడు. అనంతరం పెట్టుబడి పెట్టిన డబ్బులు తీసుకొని దుబాయి పారిపోయేవాడు. కరీంనగర్​, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్​ జిల్లాకు చెందిన పలువురు ఇతని వద్ద పెట్టుబడి పెట్టి డబ్బులు మోసపోయినట్లు సమాచారం.

Cryptocurrency Fraud | నెక్స్ట్​ బిట్ పేరిట..

హిమాంశు సింగ్ గతంలో క్రిప్టో కరెన్సీ పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. మొదట రూ.150 కోట్లు సేకరించాడు. అనంతరం దుబాయి పారిపోయాడు. ఆరు నెలల తర్వాత మళ్లీ వచ్చి కొత్త యాప్​ ద్వారా రూ.130 కోట్లు కాజేసి దుబాయి చెక్కేశాడు. అనంతరం మళ్లీ నెక్స్ట్​ బిట్​ పేరిట కొత్త యాప్​ తీసుకొచ్చాడు. దీని ద్వారా దాదాపు 400 మంది నుంచి రూ.19 కోట్లు కాజేశాడు. అనంతరం మళ్లీ పరారయ్యాడు. తాజాగా మరో కొత్త యాప్​ పేరిట ప్రజలను మోసం చేయడానికి వచ్చాడు. ఈ మేరకు హైదరాబాద్​(Hyderabad)లో మీటింగ్​ పెట్టగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు. అతనితో పాటు కరీంనగర్​కు చెందిన జమీద్​, అనిల్​, సిరిసిల్లకు చెందిన వంశీ, నిజామాబాద్​కు చెందిన శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకున్నారు.

Cryptocurrency Fraud | దందా వెనుక ప్రభుత్వ టీచర్లు

హిమాన్షు మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా తన దందాను విస్తరించాడు. ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో విస్త్రృతంగా ప్రచారం నిర్వహించాడు. ఎక్కువ ఆదాయం తీసుకొచ్చిన ఏజెంట్లను విదేశీ టూర్లకు తీసుకెళ్లాడు. దీంతో తక్కువ కాలంలోనే ఆయనను నమ్మి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. హిమాంశు బాధితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad)​, నిజామాబాద్(Nizamabad)​ నుంచి కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దందా వెనుక పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు(Government Teachers) ఉన్నట్లు సమాచారం. డబ్బులకు ఆశపడి వీరు ప్రజలను పెట్టుబడి పెట్టించినట్లు తెలుస్తోంది.

Cryptocurrency Fraud | విచారణలో కీలక విషయాలు

హిమంశు సింగ్​ను రాచకొండ పోలీసులు ఇటీవల అరెస్ట్​ చేశారు. విచారణ సమయంలో వారు కీలక విషయాలు గుర్తించారు. ఈ దందా వెనుక పలువురు విదేశీయులు సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చీఫ్  ఓవర్సీస్ కోఆర్డినేటర్​గా వియత్నాంకు చెందిన రికీ ఫామ్ ఉన్నట్లు గుర్తించారు. థాయ్‌లాండ్ నుంచి యాప్ పేమెంట్ హ్యాండ్లర్​గా రాజస్థాన్​కు చెందిన అశోక్ శర్మ, రీజినల్ రిక్రూటర్​గా డీజే సోహైల్, క్యాష్ కలెక్టర్​గా బోడుప్పల్​కు చెందిన మోహన్ వ్యవహరించారు.