అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. జార్జియాలో (Georgia) ఓ వ్యక్తి భారత సంతతికి చెందిన నలుగురిని హత్య చేశాడు. జార్జియాలో ఓ వ్యక్తి నలుగురిపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో నలుగురు భారత సంతతి పౌరులు చనిపోయినట్లు అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) తెలిపింది. మృతులను మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీశ్ చందర్‌లుగా అధికారులు గుర్తించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడు విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
America | తప్పించుకున్న పిల్లలు
లారెన్స్‌విల్లే (Lawrenceville) ప్రాంతంలోని ఒక నివాస సముదాయంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు బ్రూక్ ఐవీ కోర్ట్‌లోని (Brook Ivy Court) 1,000 బ్లాక్‌లో కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వారు వెళ్లే సరికి నలుగురు తుపాకీ కాల్పులతో చనిపోయి ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారు సమయస్ఫూర్తితో ఒక గదిలోని అల్మారాలో దాక్కొవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఒక పిల్లవాడు 911కు కాల్ చేసి సమాచారాన్ని అందించాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడిని అట్లాంటాకు చెందిన 51 ఏళ్ల విజయ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై నాలుగు హత్యాయత్నం కేసులు, నాలుగు ఫెలోనీ హత్య కేసులు, నాలుగు ద్వేషపూరిత హత్య కేసులు, పిల్లలపై క్రూరత్వానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. కుటుంబ కలహాలతోనే నిందితుడు హత్యలు చేసినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.