అక్షరటుడే, భీమ్‌గల్ : Forest lands | ఉమ్మడి జిల్లాల్లో అటవీ భూములు (Forest lands) అన్యాక్రాంతం అవుతున్నాయి. కొంతమంది యథేచ్ఛగా అడవులను నరికి వేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
అడవులను (forests) ఆక్రమించనివ్వొద్దు, పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు పాల్పడే వారిపై అటవీశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పారు. అయినా అడవుల ఆక్రమణలపై సంబంధిత అధికారులు చర్యలు చర్యలు చేపట్టడం లేదు.
పర్యావరణ సమతుల్యతకు అడవులు ఆయువు పట్టు. ప్రాజెక్టులు, ప్రారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం (industrial development and agriculture) పేరుతో వేల ఎకరాల్లో అడవులు మాయం అయ్యాయి. అంతేగాకుండా కొంతమంది అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. చెట్లను నరికి వేసి భూములను చదును చేస్తున్నారు. అనంతరం వాటిని సాగు భూములుగా మారుస్తున్నారు. రాత్రి పూట చెట్లు నరికి, ట్రాక్టర్లతో చదును చేస్తున్నారు. దీంతో అడవులు కనుమరుగు అవుతాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
Forest lands | ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లలో ప్రస్తుతం 1,76,800.30 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. కామారెడ్డి డివిజన్‌లోని ఇందల్వాయి, ఎల్లారెడ్డి, కామారెడ్డి రేంజ్ల పరిధిలో 94,030.28హెక్టార్లు, నిజామాబాద్ డివిజన్‌లోని (Nizamabad division) నిజామాబాద్, బాన్సువాడ, కమ్మర్‌పల్లి, రెంజల్ రేంజ్ల పరిధిలో 82,770.02 హెక్టార్లలో అడవులు ఉన్నాయి. అధికారులు లెక్కల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో 1952.09 ఎకరాలు, కామారెడ్డిలో 1190.04 ఎకరాల అడవులు కబ్జా అయ్యాయి.
Forest lands | అంతకుమించి..
అధికారుల లెక్కల్లో ఆక్రమణలు తక్కువగా చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేలాది ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినా వందల ఎకరాలు అయినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇందల్‌వాయి రేంజ్ పరిధిలో రెండు వేల ఎకరాల్లో, గాంధారిలో 3,200, బాన్సువాడలో 4 వేలు, ఎల్లారెడ్డిలో 1,700, కమ్మర్పల్లిలో 4 వేలు, కామారెడ్డిలో 1400 ఎకరాల భూమి కబ్జా అయింది. మొత్తం 16,300 ఎకరాల అటవీ భూమి (forest land) కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. అయితే అధికారుల లెక్కల్లో మాత్రం ఉమ్మడి జిల్లాలో 3,142 ఎకరాల్లోనే కబ్జా అయినట్లు చెబుతుండటం గమనార్హం.
Forest lands | కబ్జాకు అయిన కొన్ని భూములు
- కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని 11 తండాల్లో వేలాది ఎకరాల అటవీభూమి ఆక్రమణకు గురైంది. కొండలు, గుట్టలు సైతం ఆనవాళ్లు కోల్పోయాయి.
- భీమ్‌గల్ మండలం దేవక్కపేట్, దేవన్పల్లి, కారేపల్లి, తాళ్లపల్లి, రహత్‌నగర్ గ్రామాల పరిధిలో గుట్టలను పూర్తిగా దున్నేసి చదును చేశారు.
- సికింద్రాపూర్ గ్రామ శివారుల్లో భారీగా ఆక్రమణలు జరిగాయి.
- ఎల్లారెడ్డి రేంజి పరిధిలో అడవిలింగాల, ఎల్లుట్ల, ఎల్లుట్లపేట్ తదితర గ్రామాల పరిధిలో అటవీభూమిని పెద్ద ఎత్తున ఆక్రమించారు.
- సిరికొండ మండలం మైలారం, రావుట్ల, చీమన్‌పల్లి, ధర్పల్లి మండలం కొరట్‌పల్లి, దుబ్బాక, చల్లగరిగే గ్రామాల శివారులో అటవీభూమిని కబ్జా చేశారు.
- గాంధారి మండలం గండివేట్, యాచారం, చద్మల్ తండా, దుర్గం, నాగ్లూరు గ్రామాల పరిధిలో ఆక్రమణలు జరిగాయి.
- కామారెడ్డి రేంజ్ పరిధిలో భిక్కనూరు, నాగిరెడ్డిపేట్ మండలాల్లో అటవీభూమి ఆక్రమణకు గురైంది.
బిచ్కుంద మండలంలోని శాంతాపూర్, బేగంపూర్, ఎల్లారం, కాస్లాబాద్ తదితర గ్రామాల పరిధిలో అటవీభూములను కొందరు ఆక్రమించారు.