అక్షరటుడే, భీమ్గల్ : Osmania University | ఆర్మూర్ డివిజన్ సిరికొండ (Sirikonda) అటవీ రేంజ్ పరిధిలో బీట్ ఆఫీసర్గా పనిచేస్తున రాజేంద్ర ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నుంచి డాక్టరేట్ అందుకున్నారు. భీమ్గల్ (Bheemgal) మండలం పిప్రి (జాగీర్) గ్రామానికి చెందిన ఆయన ఓయూలో పీజీ చేశారు.
రాజేంద్ర 2012లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. బీట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నా.. ఆయనకు పీహెచ్‌డీ (PHD) చేయాలని ఉండేది. దీంతో 2018లో ఉస్మానియాలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. “ఫైటో కెమికల్ స్క్రీనింగ్ అండ్ యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీ ఆఫ్ మధూకా లొంగిఫోలియా, వాండా టెస్సెలాటా” అనే అంశంపై పరిశోధనలు చేశారు. నిజామాబాద్ జిల్లా మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ (Manchippa Reserve Forest)లో లభించే ఔషధ మొక్కలపై అధ్యయనం చేసి, వాటి ఔషధ గుణాలను వివరించారు. అనేక అంతర్జాతీయ పత్రికల్లో పరిశోధనల వివరాలు ప్రచురితమయ్యాయి.
వాండా టెస్సెలాటా (గ్రే ఆర్కిడ్) వంటి ఎపిఫైట్ మొక్కలు మధుమేహం, క్యాన్సర్, హైబీపీ, రూమటిజం వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ములుగు-సిద్దిపేటలో ఏర్పడనున్న అటవీ విశ్వవిద్యాలయంలో మరింత విస్తృత పరిశోధనలు చేయనున్నట్టు తెలిపారు. రాజేంద్ర ఈ ఘనతను సాధించడంపై రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి సువర్ణతో పాటు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.
