అక్షరటుడే, బాల్కొండ : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)లోకి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయంలోకి 2.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
రాష్ట్రంలో, ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి మొన్నటి వరకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. ప్రస్తుతం 2.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 33 వరద గేట్లు ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కులు గోదావరి(Godavari)లోకి వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1088.5 అడుగుల (71.85టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | కాలువ ద్వారా నీటి విడుదల
ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 150 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231, ఆవిరి రూపంలో 616 క్యూసెక్కుల నీరు పోతోంది. మొత్తం 1,34,397 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అవుతోంది. ఔట్ ఫ్లో కంటే ఇన్‌ఫ్లో అధికంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.