అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | ఇటీవల భారతదేశం-పాకిస్తాన్(India – Pakistan) మధ్య జరిగిన సైనిక ఘర్షణలో ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవో ఆయన వెల్లడించలేదు.
వాషింగ్టన్ లోని వైట్‌హౌస్(White House) లో జెనియస్ చట్టంపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో తాను దౌత్యం చేసి అణ్వస్త్ర పోరును ఆపానని చెప్పుకున్నారు. “మేము చాలా తీవ్రమైన యుద్ధాలను ఆపాము. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో విమానాలు నేలకూలుతున్నాయి. వాస్తవానికి, ఐదు జెట్లను కూల్చివేశారని అనుకుంటున్నాను. రెండు అణ్వాయుధ దేశాలు అవి పరస్పర దాడులతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇది కొత్త రకమైన యుద్ధంలా అనిపిస్తుంది. నేను చేసిన దౌత్యంతో యుద్ధం ఆగింది, ”అని ట్రంప్ (Donald Trump) తెలిపారు.
భారత్-పాక్ సంఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో తాను చేసిన వాణిజ్య దౌత్యంతో ప్రపంచానికి అణు ముప్పు తప్పిందని తెలిపారు. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానని ట్రంప్ ఉద్ఘాటించారు. 12 రోజుల ఉద్రిక్తతకు తానే తెర దించానని చెప్పుకొచ్చారు. “ఇరాన్‌లో మేము ఏమి చేశామో మీరు చూశారు, అక్కడ మేము వారి (ఇరాన్) అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని..” అని ట్రంప్ జోడించారు.
Donald Trump | పదే పదే అదే పాట..
తన దౌత్యం వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. రెండు వైపులా చర్చలు జరిపిన తర్వాత మే 10న రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయని, అది తన ఘనతేనని ప్రకటిస్తున్నారు. తన జోక్యంతోనే అణు యుద్ధానికి తెర పడిందని, వాణిజ్య సుంకాలు (Trade Tariffs) వడ్డిస్తానని హెచ్చరించడంతో రెండుదేశాలు వెనక్కి తగ్గాయని పలుమార్లు చెప్పుకున్నారు. కానీ ఆయన , వాదనను భారత్ తరచూ ఖండిస్తూనే ఉన్నా ఆయన అదే పాట పాడుతున్నారు. మూడో దేశ జోక్యంతో సంబంధం లేకుండా రెండు దేశాలు పరస్పర చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారతదేశ విధానం.
Donald Trump | పహల్గామ్‌కు ప్రతీకారంగా..
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియా మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రతి దాడులకు యత్నించగా ఇండియా తిప్పికొట్టింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు వారి సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్ దాడులతో బెంబేలెత్తిన పాక్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ప్రతిపాదించడంతో ఇండియా శాంతించింది.