అక్షరటుడే, వెబ్డెస్క్: Manyam District | పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చలివాతావరణంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసుకున్న నిప్పుల కుంపటి ఒకే కుటుంబాన్ని మృత్యువులోకి నెట్టింది.
తొలుత ఈ ఘటనను కుటుంబ ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన విషాద ఘటనగా తేలింది. కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxide) వాయువు ప్రభావంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందగా, మరో చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. డీఎస్పీ రాంబాబు (DSP Rambabu), సీఐ తిరుపతిరావు (CI Tirupati Rao) వివరాల ప్రకారం వనజ గ్రామానికి చెందిన మీనక మధు (35), సత్యవతి (30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Manyam District | తీవ్ర విషాదం..
పెద్ద కుమార్తె మాధురి చినమేరంగి కేజీబీవీలో చదువుతుండగా, రెండో కుమార్తె మోక్ష తాతగారి ఊరు బొమ్మికలో ఉండి చదువుకుంటోంది. చిన్న పిల్లలు అయేషా (6), మోస్య (4) తల్లిదండ్రుల వద్దే నివసిస్తున్నారు. గురువారం రాత్రి మధు, సత్యవతి, అయేషా, మోస్య ఇంట్లోనే నిద్రపోయారు. శుక్రవారం ఉదయం ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన పొరుగువారు, బంధువులు తలుపులు తెరిచి చూడగా, ఇంట్లో నలుగురు అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. చినమేరంగి సామాజిక ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు మధు, సత్యవతి, మోస్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన అయేషాను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి (Parvathipuram District Hospital), అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.
ఈ ఘటనకు అప్పుల భారం కారణమై కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత గ్రామంలో ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో వాస్తవం వేరని తేలింది. చలి నుంచి రక్షణ కోసం ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకుని తలుపులు మూసివేయడంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదలై ఊపిరాడక ఈ విషాదం చోటుచుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.