అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Goa Fire Accident | గోవా (Goa)లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు.
నైట్ క్లబ్ (Night Club)లో అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. మృతుల్లో నలుగురు పర్యాటకులు, 21 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. గోవా సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ (CM Pramod Kumar Sawant) ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
Goa Fire Accident | తీవ్రత ఎక్కువగా ఉండటంతో..
సిలిండర్ పేలుడు కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా మంది చనిపోయారు. ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారు ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేశారు.
Goa Fire Accident | దర్యాప్తు చేపడుతాం..
ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. క్లబ్‌లో భద్రతా చర్యలు చేపట్టలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్లబ్‌కు అనుమతులు ఇచ్చిన అధికారులపై సైతం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
