అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల (Ration Shops) ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం హైదరాబాద్కు వచ్చారు.
ముఖ్యమంత్రి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy)తో కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని తెలిపారు. తెలంగాణ (Telangana)లో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. పూర్తిస్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
